Sunday, 17 January 2010

జ్యోతిర్లింగము

- వంశీకృష్ణ ఘనపాఠీ

ఓం నమశ్శివాయ।

“నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః” అనే వాక్యం మనకు శతరుద్రీయంలో వినిపిస్తున్నది. శతరుద్రీయం అంటే అనేక రకాలైనటువంటి రుద్రులకు సంబంధించినటువంటి స్తోత్రము అని అర్థం. అనేకము అంటే ఎంత? ఏకము కానిది అనేకము. ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి అని. ఈ అద్భుతమైనటువంటి ప్రతిపాదన మనకు “విరూప” అనే ఒక పదంలో లభిస్తుంది. మొట్టమొదట ఎటువంటి స్వగత, పరగత, సజాతీయ, విజాతీయ, భేదాలూ లేకుండా, అఖండంగా శుద్ధ – ముక్త- బుద్ధ పరిపూర్ణంగా ఉండేదే నిర్గుణబ్రహ్మ. దానినే పరంబ్రహ్మ అనికూడా పిలుస్తారు.

అటువంటి పరబ్రహ్మ, మాయ యొక్క సంసర్గంవల్ల, కలయిక వల్ల, అనేక రకాలుగా విస్తరించాలి అనుకున్నది. ఇదే ఉపనిషత్తు వాక్యాలలో చెపుతున్నది, “తదైక్షత, బహుస్యాం ప్రజాయేయ”, అనేక రకాలుగా నేను విస్తరింతునుగాక. అనేక రకాలుగా కనబడుదునుగాక – ఈ సంకల్పం ఎపుడైతే కలుగుతున్నదో, అప్పుడు ఏకత్వమునుండి అనేకత్వంగా కనబడింది. అందువల్ల ఈ అనేక అనే పదంవల్ల చాలా విశేషం ఉన్నది. ఒకటి కంటే ఎక్కువ అంటే ఎన్ని కోట్లైనా అవచ్చు, అనంతమైనా అవచ్చు. వాస్తవానికి ఉండేటటువంటిది ఒకటే.

ఇక్కడ “విరూపేభ్యః” అనే పదంవల్ల మనకు రెండు అర్థాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, “విగతాని రూపాణి యేషాం తే విరూపాః” అని. అంటే ఎటువంటి రూపము లేకుండా ఉండటం. ఎప్పుడైతే అనేక రకాలుగా తనను తాను కనపడేటట్లుగా చేస్తున్నదో, అప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మ సగుణంగా మారుతున్నది. అప్పుడు విరూప అనే పదానికి రెండవ అర్థం చెప్పుకోవాలి. “వివిధాని రూపాణి యేషాం తే విరూపాః.” అనేక రకాలైన, రకరకాలైన రూపాలు కలిగినది అని. అందువల్ల పై నామమే “విశ్వరూపాః”. ఆ విధంగా విస్తరించినప్పుడు, విశ్వమంతటి రూపాలు కూడా తానే అయి ఉంటున్నదన్నమాట. అందువల్ల నిరాకారంగా భగవంతుడిని భావన చేయాలి అనే సంప్రదాయాన్ని జ్ఞానులు అవలంబిస్తారు.

సాక్షాత్తుగా, నిరాకారమైనటువంటి నిర్గుణ బ్రహ్మను, నిర్వికల్పంగా భావన చేయటం, సాధనయొక్క ప్రారంభ స్థాయిలో కష్టం అవుతుంది. ఈ అభిప్రాయంతోనే, భక్తులకు, ఆసక్తులకు, ఆస్తికులకు, జిజ్ఞాసువులైన మనకు పరమాత్మ తత్వం స్పష్టంగా అర్థమయ్యేందుకే పెద్దలు ఒక వ్యవస్థను ఏర్పరిచారు. అందరూ శివోపాసన చెయ్యాలి. విష్ణువును భావించేవారు కూడ సాలగ్రామార్చన చేయాలి అనే నిరాకార ఆరాధనా పద్ధతిని ప్రారంభం చేయించారు. అందువల్లే, ఉపాసకులందరూ, (అన్నీ విడిచి పెట్టిన సన్న్యాసులతో సహా) శతరుద్రీయ పారాయణ , లింగానికి అభిషేకము చేస్తారు.

శివలింగాన్ని మనం పరిశీలించినప్పుడు, ఎటువంటి ఆకారాలు కూడా శివలింగంలో ఉండవు. అయినప్పటికినీ, ఆ శివలింగాన్ని ఒక ఆకారం కలిగిన మూర్తిగా మనం మొట్టమొదట, ఆరాధన చేస్తుంటాం. ఆ లింగానికే కవచాలు, అలంకారాలు, పెడతాం.

అయితే అలా ప్రారంభమైన ఆరాధనా భావన పెంపొందినపుడు, ఉపాసనయొక్క పరమావధి అందినప్పుడు, నిరాకారమైనటువంటి పరబ్రహ్మకు లింగమే ఈ శివలింగము అని మనకు అర్థం అవుతుంది. ఈ విధంగా శివుడి యొక్క ఉపాసన, అభిషేకం, అర్చనలు లోకమంతా జరుగుతూనే ఉన్నాయి.

ఇన్ని రకాలుగా శివారాధన జరుగుతున్నప్పటికినీ కూడా, ఈ లింగము కొన్నిచోట్ల ప్రత్యేకముగా,. విశేషముగా కనబడుతున్నదని మన పురాణాలు మనకు ప్రబోధిస్తున్నాయి. వీటినే “జ్యోతిర్లింగాలు” అంటారు. జ్యోతిస్సు అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి నిర్గుణ పరబ్రహ్మ యొక్క అఖండమైన ప్రకాశము. మరి అఖండంగా జ్యోతి ఉన్నట్లైతే, ఈ పన్నెండు చోట్ల అంటున్నారేమిటి? ఈ పన్నెండు సంఖ్య ఎక్కడనుండి వచ్చినది? ఆ జ్యోతిస్సు పన్నెండు రకాలుగానే ఎందుకు మనకు కనబడాలి? అనే సందేహం మనకు సహజంగానే కలుగుతుంది. దీనికీ వేదమే సమాధానం చెప్పింది. “ఆదిత్యో జ్యోతిషాం జ్యోతి రుత్తమమ్”, అని.

సూర్యుడు అనే జ్యోతి అన్నిరకాలైన జ్యోతిస్సులకు కూడా జ్యోతిస్సు. సూర్యకాంతి వల్లే ప్రపంచంలోని ఇతర కాంతులన్నీ మనకు కనబడుతున్నాయి. చంద్రాది గోళాలతో సహా మనకు అన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా “అగన్మ జ్యోతి రుత్తమమ్”, అనే వేదవాక్యం కూడా మనకు దీనినే ప్రతిపాదిస్తున్నది. అటువంటి ఉత్తమమైనటువంటి జ్యోతి సూర్యుడు. ఆయన స్వయం ప్రకాశమానుడు. ఆ సూర్యుడు, అనేక రూపాలను స్వీకరిస్తున్నప్పుడు, పన్నెండు రకాలైనటువంటి ఆదిత్యమండలాలుగా కూడా గుర్తించారు. అవే మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క భాస్కర అనే పన్నెండు రకాలైన రూపాలు. అలా ప్రతిపాదించినప్పుడు, ద్వాదశాదిత్యుడిగా ఆయన కొలవబడుతున్నాడు.

ఈ విధంగా నిరాకారమైనటువంటి పరబ్రహ్మకు శివలింగము ఒక ప్రతీక అయితే, అఖండమైనటువంటి ఆ ప్రకాశానికి, స్వయం ప్రకాశానికి చిహ్నం సూర్యుడు. అందువల్లే నిత్యం సంధ్యావందనం చేసేటటువంటివారు, “అసౌ ఆదిత్యః పరం బ్రహ్మ” అనే ఉపాసన చేస్తూ, ఈ హృదయంలో, (ఈ జీవిలో) ఉండేటటువంటివాడు, ఆ పైన కనబడే మండలంలో ఉండేవాడూ ఒకడే మెళకువను మనకు నేర్పిస్తున్నారు.

ఒకవైపు సూర్యుడిని పరబ్రహ్మకు సంకేతమని చెబుతూ, మరొకవైపు నిరాకారమైనటువంటి శివలింగాన్ని కూడా ఆ పరబ్రహ్మకే సంకేతమంటున్నారు. కాబట్టి, ఈ రెండిటి సమన్వయంగా మనకు పురాణాలద్వారా మహర్షులూ, దేవతలు బోధించినవే “ద్వాదశ జ్యోతిర్లింగాలు.” ఇవి అనేక సందర్భాలలో స్వయంగా ఆవిర్భవించాయి.

వాస్తవానికి లింగము అనే పదానికి, నిదర్శనమని హేతువని, ఒక దృష్టాంతమని మూడు రకాలైన అర్థాలున్నాయి. జ్యోతిర్లింగము అంటే, స్వయంప్రకాశమైనటువంటి జ్యోతిస్సుతో కూడినటువంటి ఆ పరబ్రహ్మకు ఒక నిదర్శనంగా మనకు లభిస్తున్నటువంటిది అని అర్థం.

అటువంటి జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా ఎవరైతే దర్శనం చేయాలనుకుంటారో, వారికి ఆత్మసాక్షాత్కారమే పరమార్థము. ఈ జ్యోతిర్లింగ యాత్ర యొక్క ప్రధానమైనలక్ష్యం, ఆత్మసాక్షాత్కారం. ఆ స్థాయికి మనను తీసుకు వెళ్ళాలి అంటే, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలయొక్క భావనను మనస్సులో చేయాలి. అందువల్ల సూర్య, శివ ఉపాసనల సంబంధాన్ని మనకు చాలా సూక్ష్మంగా బోధించేది వైదిక యాజ్ఞిక పరంపర.

“శతరుద్రీయం హవనం ”(రుద్రయాగం) అనే విధానాన్ని మనకు బోధించిన వాడు బోధాయన మహర్షి. ఆ బోధాయన మహర్షి తన యొక్క కల్పంలో, ఉద్దేశ్యత్యాగం చెప్పవలసినప్పుడు, ఆదిత్యాత్మకాయ శ్రీరుద్రాయేదన్నమమ అని చెప్పాలన్నారు. ఆదిత్య స్వరూపంతో ఉన్న శ్రీరుద్రుడికి ఈ ఆహుతి చెందుగాక అని దీని భావం. అందువల్లే పురోహితులు, ఈ విధమైన వాక్యాన్ని (ఉద్దేశ్య త్యాగాన్ని) మనతో చెప్పిస్తారు. ఇటువంటి వాక్యోచ్చారణ బోధాయన మహర్షి యొక్క అభిప్రాయంలోని స్వారస్యాన్ని బోధిస్తున్నది.

పరంబ్రహ్మయొక్క రెండు చిహ్నాలను సమన్వయం చేస్తే, తద్ద్వారా, మనయొక్క హోమం కానీ, పారాయణలు కానీ, జపాలు గానీ, క్షేత్ర దర్శనాలు గానీ, అభిషేకాదులు కానీ, ఒకే తత్త్వాన్ని బోధిస్తున్నాయి. అందువల్ల ఆచారాలను, సంప్రదాయాలను సమన్వయం చేసుకోవాలి. ఆ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను మనసారా భావన చేసినప్పుడు, మనకు పరమార్థం ఖాయంగా సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని అనేకమంది మహాత్ములు తమయొక్క అనుభవాలనే ప్రాతిపదికగా చేసుకుని బోధిస్తున్నారు. అటువంటి మహనీయులలో, శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అగ్రగణ్యులు.

ద్వాదశ జ్యోతిర్లింగాలకు, ఆ క్షేత్రం యొక్క చరిత్రలను పురాణచరిత్రలతో సహా మనకు బోధిస్తున్నటువంటి, అద్భుతమైన కీర్తనలను, శ్రీ స్వామీజీ మనకు అందజేశారు. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క కథలతో పాటుగా, వాటి మహత్త్వాన్ని, “జ్యోతిర్లింగాకారా ద్వాదశరూపా పరమశివా” అనే వాక్యాల ద్వారా స్వామీజీ మనకు బోధిస్తున్నారు.

ప్రస్తుతం స్వామీజీవారి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క వివరణను మనస్సులో ఉంచుకుని, వాటితో పాటుగా భక్తులు ఆ క్షేత్రాలకు (భౌతికంగా) ఏ విధంగా చేరుకోవాలి? అక్కడ మనం చేయవలసిన తీర్థ, క్షేత్ర విధులు ఏమిటి? ఇటీవలి చరిత్ర చెప్పే విషయాలేమిటి అనే పలు అంశాలను మనకు బోధించేందుకు, దత్తపీఠ పండితులు, బ్రహ్మశ్రీ రాజ్ఞీ సుబ్బయ్యదీక్షితులు పూనుకున్నారు. ఆ చిరు గ్రంథమే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.

ఈ గ్రంథం సాధకులకు, యాత్రికులకు, భక్తులకు చాలా ఉపకారం చేస్తుంది, అని మనసారా విశ్వసిస్తూ, శివాత్మకంగా ప్రపంచమంతా అనుభూతమవుగాక. స్వస్తి

జ్యోతీరూపో లింగమూర్తి ర్వవిభుస్సన్

క్షేత్రే క్షేత్రే భావ్యతే సౌ మయోభూః।

మాయా మోహాపీడితోద్ధార హేతు

ర్యాత్రాయాం స్వం తత్త్వమావిష్కరోతు ।।

మయోభూః అంటే ఎల్లప్పుడూ సుఖంగా ఉండేవాడు, దుఃఖస్పర్శ ఏ కోశానా లేని వాడు. ఆయన సర్వవ్యాపకుడు అద్వితీయుడు కాబట్టే, అటువంటి శాశ్వతమైన ఆనందస్వరూపంతో ఉన్నాడు. తన ప్రతీకగా జ్యోతిస్సునూ, లింగాన్ని ఎంచుకున్న, ఆ పరమేశ్వరుడు ప్రతి క్షేత్రములోనూ భక్తులందరిచేత భావించబడుతున్నాడు. ఈ భావనవల్లే, ఆ భక్తుల మాయ, మోహము, వాటి వల్ల కలిగి పీడ తొలగిపోతున్నాయి.

ఆ స్వామి జీవనయాత్రలోనూ, తీర్థయాత్ర లోనూ, యాత్రకు వెళ్ళేవారికీ, వెళదామనుకునేవారికీ (యాత్రికులందరికీ) తన నిజ తత్త్వాన్ని ఆవిష్కరించుగాక। మంగళం మహత్।।

No comments: