Tuesday 30 November 2010

రుద్రైకాదశినీ స్తోత్రము Rudra Ekadashini Stotram (Hymn) Intro Telugu

రుద్రైకాదశినీ స్తోత్రము
- వంశీకృష్ణ ఘనపాఠీ
అవధూత దత్తపీఠాధిపతులు పరమపూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మైసూరులోని దత్తపీఠంలో స్వస్తిశ్రీ వికృతి సంవత్సర కార్తిక శుద్ధ షష్ఠి శుక్రవారం నుండి బహుళ పాడ్యమి వరకు అనగా 12-11-10 నుండి 22-11-10 వరకు అతిరుద్ర మహాయాగానికై పూనుకున్నారు. 1985లో వారు స్థాపించిన వేదపాఠశాల రజతోత్సవ సందర్భముగా జరుగుతున్న పవిత్రమైన మహాయాగమిది. విశ్వశాంతియే ధ్యేయంగా, లోకకల్యాణమే ఆదర్శంగా, సమస్త మానవాళి సుఖసంతోషాలతో ఆనందంగా జీవించడమే లక్ష్యంగా, ప్రముఖులైన వేదవిద్వాంసులతో అతిరుద్రయాగం నిర్వహించబడింది.

ఇందులో 175 మందికి పైగా ఋత్విక్కులు పాల్గొన్నారు. ప్రతి హోమకుండమువద్ద, ఒక్కొక్క విద్వాంసుడు ఆచార్యుడిగా హోమాన్ని నిర్వహించాడు. ఈయనతో పాటుగా, ఇంకా 10 మంది హోమాన్ని చేశారు. వీరి పనులను పర్యవేక్షణ చేసే పండితుడిని బ్రహ్మ అంటారు. వీరితో పాటుగా, హోమ సహాయకులు, అభిషేకము చేసేవారు ప్రత్యేకంగా ఉన్నారు. ఇలా పదకొండు హోమకుండాలలో, 11సార్లు రుద్రాధ్యాయ మంత్రాలను పారాయణ పూర్వకంగా హోమం చేస్తూ, 11 రోజులుపాటు అపూర్వంగా జరిగిన ఈ అతిరుద్ర మహాయాగానికి పూనుకున్న ఆస్తిక వరేణ్యుడు శ్రీ రాధాకృష్ణ రామచంద్ర అయ్యర్ (చికాగో) మరియు వారి కుటుంబసభ్యులు. వారి అభ్యర్థన మేరకు శ్రీస్వామీజీ నేతృత్వములో జరిగిన ఈ అతిరుద్ర మహాయాగములో ఏకాదశ రుద్రులను స్తుతిస్తూ, శివానుగ్రహానికి తోడ్పడిన  స్తోత్రమే ఈ యాగ స్మరణిక.

          యజుర్వేదములో చెప్పిన రుద్ర గణ నామాలు - ప్రభ్రాజమాన, వ్యవదాత, వాసుకి వైద్యుత, రజత, పరుష, శ్యామ, కపిల, అతిలోహిత, ఊర్ధ్వ, అవపతంత, వైద్యుత – అని.  శైవాగమములో శంభు, పినాకి, గిరిశ, స్థాణు, భర్గ, సదాశివ, శివ, హర, శర్వ, కపాలి, భవ – అని 11 నామాలను తెలిపారు. ఈ రెండిటిని సమన్వయం చేస్తూ, 11 శ్లోకాలతో పరమేశ్వరుడు గురురూపంగా స్తుతించబడుతున్న ఈ స్తోత్రమే రుద్రైకాదశిని. రుద్రుడికి సంబంధించిన పదకొండు (పద్యములు) అని అర్థము.

దీనిలోని శ్లోకాలన్నీ ముక్తక ప్రక్రియలో ఉన్నాయి. ముక్తకమనగా ఏ శ్లోకానికి ఆ శ్లోకానికే అన్వయం ఉంటుంది. ప్రతి శ్లోకం స్వతంత్రంగా ఉంటుంది. ఇందులోని శివగురువు శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ గురుదేవులే. ఇందులో భక్తుడు శివునితో స్వయంగా సంభాషణ చేస్తాడు. తన కోరికను పరమశివునకు నివేదన చేస్తాడు. తనకు ఏది కావాలో నిర్భయంగా అడుగుతాడు. తన మనస్సును శివార్పణం చేస్తాడు. సర్వం శివమయం జగత్తు అంటాడు.

ఒక భక్తుడు భగవంతునితో నేరుగా మాట్లాడుతున్నట్లుగా ఈ కావ్యం కనిపిస్తుంది. అటువంటి 11 శ్లోక బిల్వములు శ్రీస్వామీజీవారి అనుగ్రహముతో, తదంతేవాసి వంశీ కృష్ణ ఘనపాఠీ ద్వారా వెలువడి, శివారాధనలో వినియోగమై, భక్తులకు యాగ ప్రసాదంగా అందుతున్నది.

No comments: